వాణిజ్య సిలిండర్ ధర రూ. 111
జనవరి 1 నుంచే అమల్లోకి కొత్త రేట్లు
దేశ రాజధాని న్యూఢిల్లీలో సిలిండర్ ధర రూ.1691.50
కాకతీయ, తెలంగాణ బ్యూరో: నూతన సంవత్సరం ప్రారంభం వేళ ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ ధరలు భారీగా పెంచాయి. వాణిజ్య గాస్ సిలిండర్ ధర రూ.111 మేర పెరిగాయని ప్రకటించాయి. ఈ ధరలు ఈ రోజు నుంచి అంటే.. జనవరి 01 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. ఈ ధరల మార్పుతో మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో సిలిండర్ ధర రూ.1691.50, వాణిజ్య రాజధాని రూ. 1642. 50, కోల్‌కతా రూ. 1795, చెన్నై రూ. 1,849గా ఉన్నాయి. పైప్డ్ నేచురల్ గ్యాస్ ధరను తగ్గించినప్పటికీ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను మాత్రం అమాంతంగా ఆయిల్ కంపెనీలు పెంచాయి. గత 28 నెలల్లో గ్యాస్ సిలిండర్ ధర ఇంతగా ఎప్పుడూ పెరగలేదు. 2023, అక్టోబర్ తర్వాత వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు ఇంత భారీగా ఇప్పుడే పెరిగాయి.
గృహ వినియోగదారులకు ఊరట
మరోవైపు ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్ల ధరలో ఎటువంటి మార్పు లేదు. గృహ వినియోగదారులకు మాత్రం ఊరట లభించింది. ఎందుకంటే గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో 14.2 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక, వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,912.50గా ఉంది. గత నెలలో ఈ ధర రూ. 1,801.50గా ఉంది. అంటే రూ. 111 పెరిగింది. ఇక, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ. 905గా ఉంది. గత నెలతో పోలిస్తే ఇందులో ఎలాంటి మార్పు లేదు. వీటి ధరలు న్యూఢిల్లీలో రూ.853, కోల్‌కతాలో రూ.879, ముంబైలోల రూ.852.50, చెన్నైలో రూ.868.50గా ఉంది. 2025, ఏప్రిల్ నుంచి ఈ గ్యాస్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు.


