జాతరకు ఆర్టీసీ బస్సులోనే రండి….
మేడారం జాతరకు భారీ రవాణా ఏర్పాట్లు.
4000 ఆర్టీసీ బస్సులు….
మహిళలకు ఉచిత ప్రయాణం…..
మేడారంలో క్యూ లైన్ కాంప్లెక్స్, బస్టాండ్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కాకతీయ, ములుగు ప్రతినిధి: సమ్మక్క–సారలమ్మ మహా జాతర 2026ను పురస్కరించుకుని భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో మేడారంలో ఏర్పాటు చేసిన క్యూ లైన్ కాంప్లెక్సులు, బస్టాండ్‌ను శనివారం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. శనివారం ఉదయం మేడారం చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ మనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి ఆలయ పూజారు లు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉత్తర తెలంగాణ, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా 51 కేంద్రాల నుంచి దాదాపు 4000 ఆర్టీసీ బస్సులను మేడారం జాతర కోసం ప్రణాళికాబద్ధంగా నడుపుతున్నట్లు వెల్లడించారు. భక్తుల రద్దీ పెరిగితే మరిన్ని బస్సులు కూడా అందుబాటులో ఉంచేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు గుర్తు చేసిన మంత్రి, జాతర సందర్భంగా కూడా రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. భక్తులు సొంత వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల ద్వారానే మేడారానికి రావాలని కోరారు. సొంత వాహనాలతో వస్తే దూరంగా పార్కింగ్ చేయాల్సి రావడంతో పాటు నడకలో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. అందుకే ప్రజలు ప్రభుత్వ బస్సులనే వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.
జాతరలో 91 బస్ కేంద్రాల్లో క్యూ లైన్లు, షెల్టర్లు, తాగునీరు, వాష్‌రూములు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా బస్సులు మధ్యలో నిలిచిపోతే వెంటనే పరిష్కరించేందుకు క్రేన్లు, మొబైల్ టీమ్స్ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ట్రాఫిక్ జామ్ కాకుండా జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈసారి ప్రత్యేకంగా చిల్డ్రన్ ట్రాకింగ్ మానిటరింగ్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 11 ప్రధాన బస్ స్టాండ్లలో పిల్లల పేరు, మొబైల్ నంబర్ నమోదు చేసి చేతికి ట్రాకింగ్ ట్యాగ్ కట్టే విధానం ద్వారా తప్పిపోయిన పిల్లలను వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంత్రి సీతక్క సారథ్యంలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా మేడారం ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఫారెస్ట్, ఎకో టూరిజం దృష్ట్యా భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్న నేపథ్యంలో శాశ్వత బస్ స్టాండ్, శాశ్వత క్యూ లైన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రతి సంవత్సరం తాత్కాలిక ఏర్పాట్లకు ఖర్చయ్యే కోట్ల రూపాయలను తగ్గించేందుకే శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే మహా జాతరలో భక్తులను క్షేమంగా తీసుకురావడం, తిరిగి స్వస్థలాలకు చేర్చడం రవాణా శాఖ ప్రధాన బాధ్యతగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఆర్టీసీ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు పాల్గొన్నారు.


