- రేవంత్‌రెడ్డిని కలిసిన కెనడా, ఫ్రాన్స్ ప్రతినిధులు
- ప్రాజెక్టులను వివరించిన ముఖ్యమంత్రి
- సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన సుదర్శన్ రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని కెనడా ప్రతినిధులని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. శనివారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో హైకమిషనర్ ఆఫ్ కెనడా టు ఇండియా క్రిస్టోఫర్ కూటర్ బృందం సభ్యులు సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఐటీ, ఫార్మా, ఎయిర్‌స్పేస్, డిఫెన్స్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో కెనడాతో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను కెనడా హైకమిషనర్‌కు వివరించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కెనడా హైకమిషనర్‌కి సీఎం విజ్ఞప్తి చేశారు. స్టార్టప్స్, ఎడ్యుకేషన్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్‌లోనూ పెట్టుబడులకు ముందుకు రావాలని సూచించారు. సమావేశంలో కెనడా మినిస్టర్ ఎడ్ జాగర్ , ట్రేడ్ కమిషనర్ విక్రమ్ జైన్, కారెన్, తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎంతో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందం భేటీ
అలాగే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఫ్రాన్స్ కాన్సులెట్ జనరల్ మార్క్ లామీ బృందం మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో హైదరాబాద్‌లో ఫ్రాన్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్ బృంద సభ్యులని సీఎం కోరారు. హైదరాబాద్‌లో ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని మరింత బలోపేతం చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మౌద్ మిక్వా, తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సుదర్శన్ రెడ్డి.
మరోవైపు.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఇవాళ సచివాలయంలో సుదర్శన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు సుదర్శన్ రెడ్డి. అలాగే, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.


