కేజీబీవీ ఆకస్మిక తనిఖీ విద్యార్థినులతో కలెక్టర్ భోజనం
పోషకాలతో కూడిన నాణ్యమైన
ఆహారం అందించాలని ఆదేశం
కాకతీయ, పెద్దపెల్లి,కాల్వ శ్రీరాంపూర్ : విద్యార్థినులకు పోషకాలు సమృద్ధిగా ఉండే నాణ్యమైన ఆహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు సూచించారు.మంగళవారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ)ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి భోజనం చేసి, వారికి అందుతున్న ఆహారం నాణ్యతను పరిశీలించారు.
అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, డైనింగ్ హాల్, కిచెన్ ప్రాంతాలను పరిశీలించి విద్యార్థినులకు అందుతున్న విద్యా బోధన, వసతులపై ఆరా తీశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన పోషకాలు అందే విధంగా ఆహారం అందించాలని, శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కేజీబీవీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కూడా ఆదేశించారు.
ఇదే పర్యటనలో ఓదెల మండలం కొలనూరు గ్రామంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కింద జరుగుతున్న పారిశుధ్య పనులు, ఫైల్ క్లియరెన్స్ ప్రక్రియలను కలెక్టర్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


