కలెక్టర్ పమేలా సత్పతికి విశిష్ట అవార్డు
ఎన్నికల నిర్వహణలో కరీంనగర్‌కు రాష్ట్ర స్థాయి గౌరవం
కాకతీయ, కరీంనగర్ : ఎన్నికల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు కరీంనగర్ జిల్లాకు మరోసారి రాష్ట్ర స్థాయి గౌరవం లభించింది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కలెక్టర్ *పమేలా సత్పతి*కు రాష్ట్ర స్థాయి విశిష్ట అవార్డు దక్కింది. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలో చేపట్టిన వినూత్న ఓటర్ల అవగాహన కార్యక్రమాలు, ఎన్నికల అధికారుల శిక్షణ, సామర్థ్యాభివృద్ధి చర్యలను సమర్థవంతంగా అమలు చేయడమే ఈ అవార్డుకు ప్రధాన కారణంగా నిలిచింది. కలెక్టర్ పమేలా సత్పతి దిశానిర్దేశంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం వ్యవస్థీకృతంగా పనిచేసిందని రాష్ట్ర స్థాయి కమిటీ ప్రశంసించింది. ఎన్నికల నిబంధనలు, విధివిధానాలపై అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన అవగాహన కల్పించేందుకు కరీంనగర్ జిల్లాలో విస్తృత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల అధికారులు, సహాయక అధికారులు, పోలింగ్ సిబ్బంది, పరిశీలకులకు నైపుణ్యాభివృద్ధి దిశగా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా ఎన్నికల నిర్వహణను మరింత పటిష్టం చేశారు. పారదర్శకత, నిష్పక్షపాతత్వం ప్రధాన లక్ష్యంగా తీసుకుని చేపట్టిన చర్యలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.
ఓటర్ల అవగాహనకు వినూత్న చర్యలు
వినూత్న ఓటర్ల అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజాస్వామ్యంపై ప్రజల్లో నమ్మకం పెంపొందించడంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం కీలక పాత్ర పోషించింది. యువత, మహిళలు, కొత్త ఓటర్లను పోలింగ్ ప్రక్రియలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించిన విధానం రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ… ఈ అవార్డు జిల్లా యంత్రాంగం, ఎన్నికల అధికారులు, సిబ్బంది అందరి సమష్టి కృషికి గుర్తింపుగా లభించిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ అవార్డు కరీంనగర్ జిల్లా ఎన్నికల యంత్రాంగం సుశిక్షిత సిబ్బందితో, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తోందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు.


