సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
కట్టుదిట్టమైన భద్రతకు అధికారులకు ఆదేశాలు
కాకతీయ,భూపాలపల్లి : ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లలో భాగంగా హెలిపాడ్ పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ శుక్రవారం స్వయంగా పరిశీలించారు. చెల్పూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం జరగనున్న ముఖ్యమంత్రి సభకు సంబంధించిన ఏర్పాట్లను వారు క్షేత్రస్థాయిలో సమీక్షించారు. హెలిపాడ్ పరిసర ప్రాంతాల భద్రత, వాహనాల పార్కింగ్ సౌకర్యం, నిరంతర విద్యుత్ సరఫరా, అత్యవసర వైద్య కేంద్రం ఏర్పాటు, అగ్నిమాపక చర్యలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రతా చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని ఎస్పీ సంకీర్త్ పోలీసు అధికారులను ఆదేశించారు. సభ ప్రాంగణం, హెలిపాడ్ ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ముఖ్యమంత్రి సభ విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు.


