కాకతీయ, కరీంనగర్: రామడుగు మండలం దేశరాజుపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. అన్ని తరగతి గదులను పరిశీలించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో మెళకువలతో విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయురాలికి సూచించారు.
పాఠశాలలోని అన్ని గదులను వినియోగంలోకి తీసుకురావాలని, అంగన్వాడీ కేంద్రం చిన్న గదిలో నిర్వహిస్తుండడంతో పాఠశాలలో ఖాళీగా ఉన్న విశాలమైన గదికి తక్షణమే మార్చాలని ఆదేశించారు. విద్యార్థులు తప్పనిసరిగా యూనిఫామ్, షూ ధరించేలా చూడాలని, క్రమశిక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అనంతరం కలెక్టర్ పమేలా సత్పతి రామడుగు మండలం దేశరాజుపల్లి పల్లె దవాఖానను వైద్య పరీక్షలు చేయించుకుంటున్న వృద్ధులతో మాట్లాడి పల్లె దవాఖానా సేవలను అడిగి తెలుసుకున్నారు.
ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు, ఆరోగ్య మహిళ వైద్య పరీక్షల రిజిస్టర్ ను పరిశీలించి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశాలు చేశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని, నూరు శాతం మందికి ఆరోగ్య మహిళ పరీక్షలు చేయించాలన్నారు. పల్లెలో బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఉన్న వారి వివరాలు సేకరించి ఉచిత మందులను ప్రతినెలా అందజేయాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్ సనా తదితరులు ఉన్నారు.


