సీఎం విహారయాత్ర సభ
ఎన్నికలకోడ్ ఉల్లంఘిస్తూ నర్సంపేటలో పర్యటన
గుర్తు లేకుండా జరిగే ఎన్నికల్లో సీఎం ప్రచారం
ఇంత దిగజారి ప్రచారం చేసిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు
రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులా ఎన్నికల కమిషన్ తీరు
నర్సంపేటకు ఏం చేస్తారని చెప్పకుండా ముగిసిన సీఎం ప్రసంగం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
కాకతీయ, నర్సంపేట : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నర్సంపేటకు ఏమీ ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. నర్సంపేటలో నిర్వహించిన సభ విజయోత్సవ సభ కాదని, విహారయాత్ర సభ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి హెలిపాడ్ ల్యాండింగ్ రాజుపేట ప్రాంతంలో ఎన్నికల కోడ్‌కి విరుద్ధమైనా, తాము ఏ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. కానీ ప్రభుత్వం అడుగడుగునా ఎన్నికల నియమావళి ఉల్లంఘించిందన్నారు. రెండు సంవత్సరాలుగా నర్సంపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు గుమ్మరించేందుకు సీఎం పర్యటన పెట్టుకున్నారని అన్నారు. “ప్రజలు ఎదురు చూసింది అభివృద్ధి… కానీ నర్సంపేట కు వచ్చినది గాడిద గుడ్డే” అని మండిపడ్డారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం ముఖ్యమంత్రి స్థాయిలో ప్రచారం చేయడం అవమానకరం అని వ్యాఖ్యానిస్తూ, “ఇలాంటి సీఎం మరెప్పుడూ చూడలేదు” అన్నారు. ప్రత్త్యక్ష ప్రచారం లేని ఎన్నికలు అని ఎన్నికల కమిషన్ రేవంత్ రెడ్డికి ఏజెంట్‌లా వ్యవహరిస్తోందని విమర్శించారు.
మెడికల్ కాలేజ్‌కు రెండోసారి శంకుస్థాపన చేయడం సిగ్గుచేటు
“ఎమ్మెల్యే హోదాలో ఉండి మెడికల్ కాలేజ్‌కు రెండోసారి శంకుస్థాపన చేయడం సిగ్గుచేటని పెద్ది ధ్వజమెత్తారు. రెండోసారి శంకుస్థాపన చేయడం విడ్డూరం. మెడికల్ కాలేజ్, హాస్పిటల్ నేను ఉన్నప్పుడు వచ్చినవి. ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడం తగదు” అని అన్నారు. నర్సంపేట రింగ్ రోడ్ ప్రణాళిక కూడా తానే ప్రతిపాదించానని, ప్రస్తుత ఎమ్మెల్యే క్రెడిట్ తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే రింగ్ రోడ్‌కు రూ.5 కోట్ల టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు. రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ యంత్రాలు కాంగ్రెస్ ప్రభుత్వం మరచిపోయిందని, అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తుఫాన్ ప్రభావంతో వరి, మొక్కజొన్న పంటలు నష్టపోయినా ప్రభుత్వం దృష్టి సారించలేదన్నారు. “కేసీఆర్ ప్రభుత్వం కాలంలో పంటలకు నీరు, కరెంట్, రైతు బంధు, ధాన్యం కొనుగోలు— అన్నీ అద్భుతంగా జరిగాయి. ఇప్పుడు రైతులు యూరియా కోసం కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయోత్సవ సభ పెట్టడం సిగ్గుచేటు” అని మండిపడ్డారు. గత సీజన్‌లో 1260 కోట్లు రైతులకు బకాయిలుగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకోవడం అన్యాయమన్నారు. రేవంత్ రెడ్డి సభ మొత్తం “చీరెల మీదే కార్యక్రమం నడిచింది” అని విమర్శించారు. అభివృద్ధి గురించి ప్రజలకు ఏ స్పష్టమైన హామీ కూడా ఎక్కడా కనిపించలేదని, ప్రజలు అయోమయంలో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని, రైతులకు అండగా నిలబడేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు పాల్గొన్నారు.


