కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం
బీఆర్ఎస్ హయాంలోనే సాగునీటి విప్లవం
ఎల్లంపల్లి, మిడ్ మానేర్, వరద కాలువ పనులు మా కృషే
రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు
బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. శనివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల సమీపంలోని వరద కాలువను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం వరద కాలువలో ప్రవహిస్తున్న నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతల చేసినవేనని పేర్కొన్నారు. ఇటీవల లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు నడిపి కాలువలోకి నీటిని వదిలినప్పటికీ కాళేశ్వరం లేదని సీఎం చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని అన్నారు. వరద కాలువ ఆధారంగా చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, బాల్కొండ తదితర నియోజకవర్గాల్లో పంటలు సాగుతున్నాయని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సాగునీటి కేంద్రంగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్ హయాంలో పూర్తికాని ఎల్లంపల్లి ప్రాజెక్టును రూ.2052 కోట్ల వ్యయంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. అలాగే మిడ్ మానేర్ ప్రాజెక్టును రూ.1526 కోట్లకు పైగా ఖర్చు చేసి పూర్తి చేసి కాళేశ్వరం జలాలతో నింపినట్లు తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ పునరుజ్జీవన పథకం కింద సుమారు రూ.2000 కోట్లతో వరద కాలువను పునరుద్ధరించి ఏడాది పొడవునా నీరు ఉండేలా చేశామని చెప్పారు. వరద కాలువను రిజర్వాయర్‌లా అభివృద్ధి చేసి రెండు వైపులా తూములు ఏర్పాటు చేయడంతో వేలాది ఎకరాల్లో పంటలు సాగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రాజెక్టులు పూర్తి చేసిన బీఆర్ఎస్, విమర్శలతోనే కాంగ్రెస్
సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు మల్కపేట రిజర్వాయర్, మెట్పల్లి ప్రాంతానికి నీరు అందించే సదర్మాట్ ప్రాజెక్టు, హుస్నాబాద్ ప్రాంతానికి సాగునీరు అందించే గౌరవెల్లి ప్రాజెక్టు వంటి పలు సాగునీటి ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని హరీశ్ రావు తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టులో 96 శాతం పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసినప్పటికీ మిగిలిన పనులను కూడా ప్రస్తుత ప్రభుత్వం పూర్తిచేయలేకపోతోందని విమర్శించారు. గత రెండున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం ఒక్క కొత్త సాగునీటి ప్రాజెక్టును కూడా ప్రారంభించలేదని, ఇప్పటికే 70–80 శాతం పూర్తైన పనులను కూడా ముందుకు తీసుకెళ్లలేకపోతోందని ఆరోపించారు. మేడిగడ్డ వద్ద కొన్ని పిల్లర్లు దెబ్బతిన్నాయని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని ప్రచారం చేయడం సరైంది కాదని హరీశ్ రావు అన్నారు. అవసరమైన మరమ్మతులు చేపడితే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం విమర్శలకే పరిమితం కాకుండా సాగునీటి పనులను ముందుకు తీసుకెళ్లాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.


