కాకతీయ, ములుగు: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర అభివృద్ధి మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో భాగంగా ఈనెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించనున్నట్టు సమాచారం. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో మేడారం వన దేవతల ఆశీస్సులతో ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మేడారం జాతర అభివృద్ధి పనులలో భాగంగా జిల్లాకు వస్తుండటంతో స్థానికుల్లో ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ ప్రభుత్వం 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మహా జాతరకు రూ.150 కోట్లు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మంజూరు చేసింది. ఈ నిధులతో జాతర ప్రాంగణంలో తాగునీరు, రహదారులు, పార్కింగ్ స్థలాలు, శానిటేషన్ వంటి తాత్కాలిక ఏర్పాట్లు చేపట్టనున్నారు. అదనంగా శాశ్వత అభివృద్ధి పనుల కోసం రూ.236 కోట్లు కేటాయించారు.
ప్రత్యేక మాస్టర్ ప్లాన్ కింద రహదారులు, వసతిగృహాలు, సౌకర్యాల కేంద్రాలు, శాశ్వత మౌలిక వసతుల నిర్మాణం చేపట్టనున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర కోసం ప్రభుత్వం ఈ భారీ నిధులు కేటాయించడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.


