సీఎం సభను విజయవంతం చేయాలి
గ్రామ గ్రామాన కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి
కార్పొరేషన్ ఎన్నికలకు కీలక మలుపు
అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు పిలుపు
కాకతీయ, కరీంనగర్ : చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో గురువారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుమ్లాపూర్‌కు విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ సభ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కీలకంగా మారనుందని చెప్పారు.
భారీగా జనసమీకరణకు పిలుపు
కరీంనగర్ రూరల్ మండలంలోని 14 గ్రామాలు, కొత్తపల్లి మండలంలోని 6 గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వెలిచాల కోరారు. ప్రతి గ్రామం నుంచి కనీసం 700 మంది చొప్పున సభకు హాజరయ్యేలా నాయకులు ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. కార్లు, ద్విచక్ర వాహనాలు, డీసీఎంలు తదితర వాహనాల ద్వారా గురువారం మధ్యాహ్నం ఒంటిగంటలోపు గుమ్లాపూర్‌కు చేరుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
కార్పొరేషన్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి పర్యటన శుభపరిణామమని పేర్కొన్న వెలిచాల, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం సభ ద్వారా ప్రజలకు వివరించనున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రతి గ్రామంలో ప్రజలకు చేరవేసే బాధ్యత పార్టీ శ్రేణులదేనని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్‌కు మరింత ఆదరణ పెరుగుతుందని చెప్పారు.
ఏర్పాట్ల పరిశీలన
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గుమ్లాపూర్‌లో సభ ఏర్పాట్లను బుధవారం కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిలతో కలిసి వెలిచాల రాజేందర్ రావు సభా వేదిక, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, బహిరంగ సభను చారిత్రాత్మకంగా నిర్వహించాలని ఆయన పునరుద్ఘాటించారు.


