18న పాలేరుకు సీఎం రేవంత్
▪️ రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
▪️ మున్నేరు–పాలేరు లింక్ కెనాల్‌కు శ్రీకారం
▪️ జేఎన్‌టీయూ, నర్సింగ్ కళాశాలలతో విద్యకు ఊపిరి
▪️ కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన
▪️ మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలకు సీఎం దిశానిర్దేశం
▪️ హైదరాబాద్ వెలుపల తొలిసారి మేడారంలో క్యాబినెట్ భేటీ
రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి
కాకతీయ, కూసుమంచి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా రూ.362 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. మద్దులపల్లిలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులకు సీఎం శ్రీకారం చుడతారని వెల్లడించారు. రైతాంగానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్‌ను సీఎం ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కూసుమంచి మండలంలో రూ.వ్యయంతో నిర్మించనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి కూడా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొంటారని వెల్లడించారు. ఇదే వేదికగా రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారని చెప్పారు.

హైదరాబాద్ వెలుపల తొలిసారి క్యాబినెట్ భేటీ
రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ నెల 18న మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ భేటీ జరగడం ఇదే తొలిసారని తెలిపారు. ఇది చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. సమ్మక్క–సారలమ్మ మహాజాతరను కుంభమేళాకు మించి అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని మంత్రి చెప్పారు. మేడారంలో కాకతీయుల నాటి వైభవం ప్రతిబింబించేలా నిర్మించిన రాతి కట్టడాలను ఈ నెల 19న ఉదయం ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. గత ప్రభుత్వాల్లా ఎన్నికల వేళ బొమ్మలు చూపడం తమ అలవాటు కాదని, ప్రజల మధ్య ఉండి నిరంతరం పనిచేసే ప్రభుత్వమిదని స్పష్టం చేశారు. అలాగే గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని పునరుద్ఘాటించారు.


