కాకతీయ, నేషనల్ డెస్క్: ఓట్ల చోరీని అడ్డుకోవాలని పోరాటం చేస్తున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, విపక్ష ఎంపీలను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యయుతంగా ఈసీ ఆఫీసుకు ర్యాలీ చేస్తున్న నేతలను అమానవీయంగా అడ్డుకోవటం దుర్మార్గమైన చర్య అని ముఖ్యమంత్రి మండిపడ్డారు.
రాహుల్ గాంధీ, ఇటీవల ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ, ఓటు హక్కు పవిత్రత గురించి దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఉద్యమం భాగంగా ఆయన ప్రజలతో నేరుగా కలిసే కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, పోలీసులు జోక్యం చేసుకుని ఆయనను, ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు.
ఈ అరెస్టులను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ, ఇది ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి బీజేపీ వేసిన అడుగని పేర్కొన్నారు. “ఒకవైపు మేము ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తున్నప్పుడు, మరోవైపు ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అణచివేయడానికి బలప్రయోగం చేస్తోంది” అని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు ఈ ఘటనపై నిరసనలు వ్యక్తం చేస్తూ, రాహుల్ గాంధీ, ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


