22న నర్మెట్టకు సీఎం రేవంత్ రెడ్డి రాక
ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి
కాకతీయ, గజ్వేల్: నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 22న ప్రారంభించి రైతులకు అంకితం చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి తెలిపారు. శుక్రవారం వర్గల్ మండలం అంబర్పేటలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా సహా సమీప ప్రాంతాల రైతులు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ పంటకు ఈ ఫ్యాక్టరీ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అదే రోజున ముఖ్యమంత్రి రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ వరి పంటతో పాటు ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సాహకాలు అందజేస్తోందన్నారు. రైతు సదస్సును విజయవంతం చేయాలని నియోజకవర్గ రైతులు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గజ్వేల్ అభివృద్ధికి సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో రూ.5.41 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్, సదానంద రెడ్డి, వెంకటేష్, నీల శ్రీనివాస్, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


