కాకతీయ, తెలంగాణ బ్యూరో : మైనారిటీల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసింది. శుక్రవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రెండు కొత్త పథకాలను లాంచనంగా ప్రారంభించారు.
ప్రారంభించిన పథకాలు.. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, వితంతువులు, విడాకులు పొందినవారు, అనాధలు, అవివాహిత మహిళలకు రూ. 50,000 ఆర్థిక సాయం. రేవంతన్నా కా సహారా, మిస్కీన్‌ల కోసం, ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు, ఒక్కొక్కరికి రూ. 1 లక్ష గ్రాంట్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ రెండు పథకాలు మైనారిటీల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయి. మైనారిటీల అభివృద్ధి అంటే కేవలం సబ్సిడీలు కాదు, వారిని స్వయం ఉపాధి దిశగా నడిపించడం మా సంకల్పం అన్నారు.
ప్రభుత్వం ఈ పథకాలకే రూ.30 కోట్లు కేటాయించినట్లు వెల్లడించిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చి వెంటనే అమలు చేసే నాయకుడు. రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్న పథకాలు మైనారిటీల కోసం అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ వివరాలు.. ప్రారంభం : 19-09-2025, చివరి తేదీ : 06-10-2025 ఆన్‌లైన్ దరఖాస్తులు మాత్రమే (tgobmms.cgg.gov.in).. ఆఫ్‌లైన్ అప్లికేషన్లు పరిగణించరు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, గ్రంథాలయాల చైర్మన్ డా. రియాజ్, కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మనలా మోహన్ రెడ్డి, టి జి ఎం ఎఫ్ సి వీసీ & ఎం.డి కాంతి వెస్లీ ఐఎఎస్, షఫియుల్లా ఐ ఎఫ్ ఎస్, ఏ జి ఎం కె. పెర్సిస్, రీజినల్ అధికారి ప్రవీణ్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.


