ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ భేటీ
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కీలక చర్చ
కాంగ్రెస్ విజయంపై ప్రియాంక హర్షం
సీఎం రేవంత్‌కు ప్రత్యేక అభినందనలు
సంక్షేమ పథకాలే విజయానికి కారణమన్న సీఎం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ పార్టీ విజయంపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయంపై ప్రియాంక గాంధీ సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు భారీ మద్దతు ఇవ్వడం పార్టీకి ఉత్సాహాన్నిచ్చిందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు, నాయకత్వంపై ప్రశంసలు కురిపించినట్లు సమాచారం.
కాంగ్రెస్ విజయంపై హర్షం
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని ప్రియాంక గాంధీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పార్టీ మరింత బలపడేలా చర్యలు కొనసాగించాలని సూచించినట్లు తెలిసింది. ప్రజలకు చేరువైన పాలనతోనే పార్టీకి విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజాహిత నిర్ణయాలే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణమని ప్రియాంక గాంధీకి వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతానికి కృషి కొనసాగిస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జరిగిన ఈ భేటీ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కీలకంగా మారింది. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.


