మంచుకొండ క్లస్టర్‌లో సీఎం కప్ క్రీడల సందడి
క్రీడలతో ఆరోగ్యం – చదువుతో భవిష్యత్
కాకతీయ, రఘునాథపాలెం : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మండల క్లస్టర్ సీఎం కప్ క్రీడా కార్యక్రమాలు రఘునాథపాలెం మండలం మంచుకొండ క్లస్టర్‌లో ప్రారంభమయ్యాయి. మంచుకొండ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ప్రారంభోత్సవంలో మంచుకొండ సర్పంచ్ శంకర్ నాయక్, పువ్వాడ నగర్ సర్పంచ్ షేక్ సిద్ధిక్‌తో పాటు ఇరు గ్రామాల కార్యదర్శులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ నగర్ సర్పంచ్ షేక్ సిద్ధిక్ మాట్లాడుతూ, క్రీడలు ఆడడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని, చదువుతో పాటు క్రీడలకు కూడా విద్యార్థులు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావనను పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి విద్యార్థిని, క్రీడాకారుడిని ఆయన అభినందించారు. పువ్వాడ నగర్ గ్రామం నుంచి సీఎం కప్ పోటీల్లో పాల్గొంటున్న జట్టుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామానికి క్రీడారంగంలో మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడా కార్యక్రమాలు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచుతూ గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను వెలికి తీసేలా దోహదపడుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.


