యువతలో ఆత్మవిశ్వాసం పెంపే లక్ష్యంగా సీఎం కప్
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
కాకతీయ, గణపురం : క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే సంకల్పంతో సీఎం కప్ 2025–26 నిర్వహిస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం గణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే సీఎం కప్ క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడా ర్యాలీని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కొద్దిదూరం ర్యాలీలో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి క్రీడాకారుడిని రాష్ట్రస్థాయి వేదిక వరకు తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. సీఎం కప్ ద్వారా యువతకు క్రీడలను జీవనోపాధిగా మలచుకునే అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతిభ కలిగిన క్రీడాకారుల భవిష్యత్తు వృథా కాకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


