కాకతీయ, అమరావతి: వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల లభ్యత, సరఫరాపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం. సీఎస్, డీజీపీ, వ్యవసాయశాఖ, విజిలెన్స్ అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా వివరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. యూరియా, ఎరువుల స్టాక్ చెకింగ్ చేపట్టాలంటూ చంద్రబాబు స్పష్టం చేశారు.
ఎరువుల ధరలు పెంచి అమ్మినవారిపై కఠినచర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మార్క్ ఫెడ్ ద్వారా ఎంతమేరకు ఎరువులు సరఫరా జరుగుతుందో అధికారులు వివరించారు. ప్రైవేట్ డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి మార్క్ ఫెడ్ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగే విధంగా చూడాలని సీఎం ఆదేశించారు. యూరియా సరఫరా విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలంటూ స్పష్టం చేశారు. ఎరువులు పక్కదారి పట్టకుండా చూడాలంటూ ఆదేశించారు.


