కాకతీయ, నేషనల్ డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం దోడా జిల్లాలోని భలేషా ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ అయినట్లు అధికారులు తెలిపారు. దీని కారణంగా జనజీవనం అంతరాయం కలిగింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి (NH-44) పై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటం, రాళ్ళు కూలిపోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
రాంబన్‌లోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి (NH-44)పై మంగళవారం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా, అనేక చోట్ల కొండచరియలు విరిగిపడట, పర్వతాల నుండి రాళ్ళు పడటం వంటి సంఘటనలు సంభవించాయి. దీంతో రోడ్లపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాతావరణం సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ మార్గంలో అనవసరమైన ప్రయాణాలను నివారించాలని, ఇంటి నుండి బయటకు రావద్దని పరిపాలన ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కొండచరియలు విరిగిపడటంతో కత్రా-శివఖోరి జాతీయ రహదారిని అధికారులు మూసివేసారు. ట్రాఫిక్‌ను కూడా మళ్లించారు.
భారీ వర్షాల కారణంగా, రియాసి జిల్లాలోని సిలా గ్రామం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కాట్రా-శివ్‌ఖోరి జాతీయ రహదారిని మూసివేశారు. శిథిలాలు రాళ్ళు హైవేపై పడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు, పరిపాలన వెంటనే ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించారు.బల్వా రోడ్డు కూడా వర్షం వల్ల ప్రభావితమైందని డిఎస్పీ రియాసి విశాల్ జామ్వాల్ తెలిపారు. చీనాబ్ నది నీటి మట్టం పెరుగుతోందని.. కొన్ని ప్రాంతాల్లో ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. ప్రమాదకర ప్రదేశాలలో SDRF బృందాలను మోహరించారు. ముఖ్యంగా నది ఒడ్డున నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా బయటకు వెళ్లవద్దని పరిపాలన సూచించింది.


