శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
పరిశుభ్రమైన వాతావరణంలోనే ఆరోగ్యకరమైన జీవనం
కలెక్టర్ జితేష్ పాటిల్
ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆవరణలో ప్రత్యేక శ్రమదానం
ఉత్సాహంగా పాల్గొన్న జిల్లా అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు ..
కాకతీయ, కొత్తగూడెం రూరల్: స్వచ్ఛత ఒక్కరోజు నిర్వహించే కార్యక్రమం కాదని, ప్రతి పౌరుడు నిరంతరం ఆచరించాల్సిన బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. పరిశుభ్రతా కార్యక్రమాలు సమాజంలో నిత్యకృత్యంగా కొనసాగితేనే ఆరోగ్యవంతమైన శుభ్రమైన పచ్చదనంతో కూడిన వాతావరణం ఏర్పడుతుందని పిలుపునిచ్చారు. భారత ప్రధాని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆవరణలో ప్రత్యేక శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రమదానంతో విశ్వవిద్యాలయం ఆవరణలోని గడ్డిని, పిచ్చిమొక్కలను తొలగించారు,
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఇంటి నుండి సమాజం వరకు ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రతి ఇంటి వద్దే చెత్తను వేరువేరు డబ్బాల్లో వేసి సక్రమంగా పారవేయాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయరాదన్నారు. మురుగు కాలువల్లో చెత్త పడితే నీటి ప్రవాహం ఆగిపోతుందని, దాంతో దోమల పెరిగి పలు రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయన్నారు. పరిశుభ్రమైన వాతావరణంలోనే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులతో పాటు విద్యార్థులు, యువత ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటే భవిష్యత్ తరాలకు పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన సమాజాన్ని అందించగలమని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు స్వచ్ఛతకు కట్టుబడి ప్రతిజ్ఞ చేసి, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కట్టుబడి ముందడుగు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఏడీ మైన్స్ దినేష్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఏడీ రమేష్, మెప్మా పీడీ రాజేష్, జిల్లా ఉద్యోగులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


