ఆ ఇద్దరికీ క్లీన్ చిట్ ?
దానం, కడియంసైతం సేఫ్!
నాగేందర్, శ్రీహరి పిటిషన్లు మాత్రమే పెండింగ్‌లో..
తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు ఊరట
ఆయన పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవ్..
స్పీకర్ ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం
బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ.. కొట్టివేత
10 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు ఆరోపణలు
ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట
మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలపై త్వరలో తీర్పు
స్పీకర్ నిర్ణయంపై గులాబీపార్టీ తీవ్ర ఆగ్రహం
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ నేతల ఫైర్
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మరో కీలక పరిణామం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పార్టీ మారినట్లు దాఖలైన పిటిషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. ఆయన పార్టీ ఫిరాయించినట్లు తగిన ఆధారాల్లేవంటూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్‌ను తాజాగా విచారించిన స్పీకర్ కొట్టేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి మొత్తం 10 మంది పార్టీ ఫిరాయించి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ బీఆర్‌ఎస్ తెలంగాణ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సంజయ్ పిటిషన్‌ను కొట్టేయగా.. ఈ వ్యవహారంలో ఇప్పటి దాకా 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలోనే స్పీకర్ తన తీర్పును వెలువరించాల్సి ఉంది.
ఆధారాల్లేవ్
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. వారిలో పది మంది ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్), కాలె యాదయ్య (చేవెళ్ల), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్ర నగర్), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (గద్వాల), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), సంజయ్ కుమార్ (జగిత్యాల) పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వారిపై అనర్హత వేటువేయాలని స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. పిటిషన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్డు స్పీకర్‌ను ఆదేశించింది. దీంతో తాజాగా సంజయ్‌తో కలిపి 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ప్రస్తుతం దానం నాగేందర్, కడియం శ్రీహరిల పిటిషన్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. వీరిలో దానం నాగేందర్‌కు ఇటీవల స్పీకర్ నోటీసులు ఇవ్వగా.. ఆయన అఫిడవిట్ ద్వారా తన నిర్ణయాన్ని తెలియజేశారు. తాను పార్టీ మారలేదని బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయలేదని చెప్పారు. ఇక మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కూడా విచారణ నోటీసులు జారీ చేయగా.. నేడు విచారణకు హాజరు కానున్నారు.
సుప్రీం సీరియస్
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది. రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని నాలుగు వారాలకు వాయిదా వేసింది. నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని స్పీకర్‌ను ఆదేశించడంత నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కడియంపై కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకోవడానికి ఆటంకాలులేవు. విచారణ పూర్తవగానే నిర్ణయం తీసుకుంటారు. దానం నాగేందర్ కూడా ఇప్పటికే వివరణ ఇచ్చారు. ఆయన కూడా సాంకేతిక అంశాల ఆధారంగా తాను పార్టీ మారినట్లుగా బీఆర్ఎస్ భావిస్తోందని వాదించారు. అంటే ఆయనపై కూడా అనర్హతా వేటు వేయకుండా పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని ప్రకటించే అవకాశం ఉంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నారన్న దానిపై సుప్రీంకోర్టు విచారణ జరపడంలేదు. బీఆర్ఎస్ .. స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదన్న దానిపైనే పిటిషన్ వేసింది. అదే అంశంపై విచారణ జరుగుతోంది. స్పీకర్ తదుపరి విచారణలోపు ఆ ఇద్దరిపైనా నిర్ణయం తీసుకుంటే.. ఇక ఆ కేసు విచారణ ముగిసిపోయినట్లే. స్పీకర్ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే.. మరో పిటిషన్ ఫ్రెష్‌గా దాఖలు చేయాల్సి ఉంటుంది.
వికృత క్రీడ: కేటీఆర్
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ వరుసగా కొట్టివేస్తున్నతీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కు కండువా కప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలు కళ్లముందు కనిపిస్తున్నా ఆధారాలు లేవని అనర్హత పిటిషన్‌ను తిరస్కరించడం అర్థరహితమన్నారు. అటు సుప్రీంకోర్టు తీర్పును, ఇటు ప్రజాతీర్పును కాలరాసి గోడదూకిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగబద్ధంగా చర్య తీసుకోకుండా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నడుచుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కేటీఆర్ మండిపడ్డారు. ఓవైపు జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల వేళ అసలు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి దుమ్మెత్తిపోస్తున్నతరుణంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వడం స్పీకర్ పదవికున్న గౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తగిలిన ఘోరమైన ఎదురుదెబ్బతో కోలుకోని కాంగ్రెస్ పార్టీ బైఎలక్షన్స్ అంటే భయపడుతోందని అర్థమైపోయిందన్నారు.


