ఓడిన అభ్యర్థుల మధ్య ఘర్షణ
పున్నేలులో అనుహ్యంగా బీఆర్ ఎస్ అభ్యర్థి విజయం
కాంగ్రెస్ రెబల్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య చీలిన ఓట్లు
ఒకరినొకరు నిందించుకుంటూ ఫైటింగ్‌కు దిగిన రెండు వర్గాలు
కాకతీయ, వరంగల్ సిటీ : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం ఓడిన అభ్యర్థుల వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో భౌతిక దాడులకు పాల్పడగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుధీర్, రెబల్ అభ్యర్థిగా దేవేందర్, బీఆర్ఎస్ తరఫున ఉస్మాన్ అలీ పోటీ చేశారు. ప్రచారంలో సుధీర్, దేవేందర్ మధ్యే ప్రధాన పోటీ అన్నట్లు జోరుగా సాగింది. అయితే అనూహ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఉస్మాన్ అలీ కాంగ్రెస్ అభ్యర్థిపై సుమారు 80 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.ఈ ఫలితం వెలువడిన వెంటనే తీవ్ర మనస్థాపానికి గురైన ఓడిన అభ్యర్థుల వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగిందని తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పోలీసులు స్పష్టం చేశారు.


