కన్నతల్లి మరణించినా వీడని పౌర బాధ్యత
కాకతీయ, జమ్మికుంట : కన్నతల్లి మరణించిన తీవ్ర విషాదంలోనూ ఓ యువకుడు తన పౌర బాధ్యతను విస్మరించకుండా ఆదర్శంగా నిలిచాడు. జమ్మికుంట మున్సిపాలిటీ 18వ వార్డు పరిధిలోని కొత్తపల్లికి చెందిన రాజు బి. ఈ రోజు అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబం మొత్తం దుఃఖసాగరంలో మునిగిపోయిన వేళ, ఆమె కుమారుడు ఎండి ఇస్మాయిల్ మాత్రం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో తల్లి మృతదేహం ఉండగానే, తన బాధను గుండెల్లో దాచుకుని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబంలో తీవ్ర విషాదం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య పట్ల ఆయన చూపిన నిబద్ధతను చూసి అక్కడి వారు భావోద్వేగానికి లోనయ్యారు. బాధ్యతాయుత పౌరుడిగా ఇస్మాయిల్ ప్రదర్శించిన ధైర్యసాహసాలు పలువురిని కంటతడి పెట్టించాయి.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత బాధను పక్కనపెట్టి ఓటేయడానికి వచ్చిన ఆయన తీరు అందరికీ ఆదర్శమని పలువురు ప్రశంసించారు.


