సిగరెట్ రూ. 48
ధూమపానం, గుట్కా ప్రియులకు కేంద్రం షాక్
పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ
ఫిబ్రవరి 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త రేట్లు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: దేశంలో పొగాకు వినియోగాన్ని నియంత్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లు సహా అన్ని పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది సిగరెట్ వినియోగదారులపై భారం పెరగనుంది. చ్యూయింగ్ టొబాకో, జర్దా సెంటెడ్ టొబాకో, గుట్కా తయారీ యంత్రాలకు సంబంధించిన 2026 నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. దీని ప్రకారం, సిగరెట్ పొడవును బట్టి ప్రతి వెయ్యి సిగరెట్లపై రూ.2,050 నుంచి రూ.8,500 వరకు ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేయనున్నారు.
జీఎస్టీకి అదనంగా ఎక్సైజ్ డ్యూటీ
ప్రస్తుతం పొగాకు ఉత్పత్తులపై అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీకి అదనంగా ఈ ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నారు. జీఎస్టీ పరిహార సెస్సును రద్దు చేసి, దాని స్థానంలో హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్సును అమలు చేయనున్నారు. అయితే బీడీలపై మాత్రం 18 శాతం జీఎస్టీ మాత్రమే కొనసాగనుంది. డిసెంబర్‌లో పార్లమెంట్ ఆమోదం పొందిన రెండు బిల్లుల ఆధారంగా ఈ కొత్త పన్ను విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రజారోగ్య పరిరక్షణతో పాటు జీఎస్టీ వ్యవస్థ సరళీకరణే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రకటనతో సిగరెట్ తయారీ కంపెనీల షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ వంటి ప్రధాన కంపెనీల షేర్లు 8 శాతం వరకు నష్టపోయాయి. మార్కెట్ లీడర్ ఐటీసీ షేరు 2 శాతం తగ్గగా, మార్లబరో సిగరెట్లను విక్రయించే గాడ్‌ఫ్రే ఫిలిప్స్ షేరు 4 శాతం కంటే ఎక్కువగా పడిపోయింది.
భారత్‌లో టొబాకో ఉత్పత్తులపై పన్నుల పెంపు కొత్త కాదు. గత పదేళ్లుగా సిగరెట్లను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వాలు ఒక్కోసారి ఒక్కో విధంగా పెంచుకుంటూ పోతూ వచ్చాయి. ఇప్పుడు అదే క్రమంలో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్‌మెంట్ బిల్ -2025 సిగరెట్ మార్కెట్‌లో కలకలం రేపుతోంది. ఈ బిల్లు అమలులోకి వస్తే ఇప్పటివరకు ఉన్న టాక్స్ లెక్కలన్నీ మారిపోతాయి. ఇప్పటివరకు సిగరెట్లపై 5 శాతం కంపెన్సేషన్ సెస్,1,000 సిగరెట్ స్టిక్స్‌పై రూ.2,000 నుంచి రూ.3,600 మధ్య ప్రత్యేక ఎక్సైజ్ టాక్స్ ఉండేది. దానికి జీఎస్టీ కూడా యాడ్ చేయడంతో ధరలు ఇప్పటికే భగ్గుమంటున్నాయి. అయితే సిగరెట్లను జీఎస్టీ 2.0 పరిధిలోకి తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీని అర్థం ఏంటి? అంటే 40 శాతం జీఎస్టీతో పాటు కొత్తగా రూపొందించిన భారీ ఎక్సైజ్ డ్యూటీ కూడా కలపాలని కేంద్రం యోచిస్తోందని తెలుస్తోంది.
ధరలు పెంచితే అలవాటు మానేస్తారా?
అయితే ఇక్కడ మరో పెద్ద ప్రమాదం కూడా ఉంది. ధరలు ఒక్కసారిగా పెరిగితే వినియోగదారుడు మానేస్తాడంటే..లేదు. చరిత్ర చెబుతున్న నిజం ఏంటంటే… ధరలు పెరిగినప్పుడు చాలామంది అక్రమ మార్గాల వైపు మళ్లారు. నకిలీ సిగరెట్లు.. స్మగ్లింగ్ బ్రాండ్లు.. ట్యాక్స్ ఎగ్గొట్టే ఉత్పత్తులపై మొగ్గు చూపే ప్రయత్నం చేస్తారు. ఇది ఆరోగ్యానికి మరింత ప్రమాదం. ప్రభుత్వానికి కూడా రెవెన్యూ నష్టం. చట్టబద్ధ కంపెనీలకు భారీ నష్టాలు మూటగట్టుకుంటాయి. సిగిరెట్ రేట్లు ఇంకా పెరిగితే ఇంకొంతమంది సిగరెట్లు మానేసి బీడీల వైపు మళ్లే అవకాశం కూడా ఉంది. బీడీలు ఇంకా చాలా చౌక. కానీ ఆరోగ్య పరంగా అవి మరింత ప్రాణాంతకం. ఈ మొత్తం వ్యవహారం టొబాకో కంపెనీలను కూడా ఆందోళనలో పడేసింది. పన్ను పెరిగితే ప్రభుత్వానికి డబ్బు వస్తుంది. కానీ కంపెనీల అమ్మకాలు పడిపోతాయి. ముఖ్యంగా మాస్ సెగ్మెంట్‌లో సిగరెట్ అమ్మకాలు భారీగా పడే అవకాశం ఉంది. అలాగే యువతపై కూడా ధరల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొత్తగా అలవాటు పడేవాళ్లకు ధరే పెద్ద అడ్డంకి. మొత్తానికి ప్రభుత్వం ఉద్దేశం ఒక్కటే. సిగరెట్లను నెమ్మదిగా ప్రజలకు దూరం చేయడం. సో..ఇకపై సిగరెట్ తాగడం కేవలం ఆరోగ్యానికే కాదు… జేబుకు కూడా ముప్పే.


