పిల్లల హక్కులను కాపాడాలి
వలస సుభాష్ చంద్రబోస్
బాల కార్మిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
కాకతీయ, కరీంనగర్ : ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా కోహెడ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేతులతో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు, సామాజికవేత్త వలస సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.బాలల హక్కులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బాల కార్మిక నిర్మూలన చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పిల్లలు తమ హక్కులను తెలుసుకుని, వాటిని కాపాడుకోవడానికి సమాజం మొత్తం బాధ్యత వహించాలని సూచించారు.నేటి బాలలే రేపటి భారత పౌరులు. వారు పని చేయించడం గమనించిన వెంటనే టోల్ ఫ్రీ 1098కు సమాచారం ఇవ్వాలి అని పిలుపునిచ్చారు. చిన్నారులకు పరిశుభ్రమైన వాతావరణం, సంపూర్ణ ఆరోగ్యం, మంచి విద్య అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని పేర్కొన్నారు.బాలల హక్కుల ప్రజావేదిక గత రెండు దశాబ్దాలుగా బాల కార్మిక నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలన కోసం తెలంగాణవ్యాప్తంగా పని చేస్తోందని వెల్లడించారు. తెలంగాణను బాల కార్మిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు మరిన్ని నిధులు కేటాయించి, వాటిని బలోపేతం చేయాలని కోరారు.చిన్నారులు పట్టుదలతో చదువుపై దృష్టి పెట్టి, పుస్తక పఠన అలవాటు పెంచుకొని భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ మహిముద్దీన్, మాజీ విద్యా కమిటీ ఛైర్మన్ గాజుల వెంకటేశ్వర్లు, బాలల హక్కుల ప్రజావేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బైరి చంద్రశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.


