కిడ్నీ అమ్మేస్తా అంటూ చిన్నారికి బెదిరింపులు
ఆగంతకుడి కోసం గాలింపు వేగవంతం
కాకతీయ, ఖిలావరంగల్ : క్రికెట్ ఆడుతున్న చిన్నారిని కారులో ఎక్కించుకున్న ఆగంతకుడు కలకలం రేపాడు. ఈ ఘటన వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఓ బాలుడిని మాత్రమే తీసుకెళ్లి, మిగిలిన పిల్లలను కారు దిగమన్నట్లు తెలిసింది. సదరు బాలుడు చాకచక్యంగా తప్పించుకుని తల్లిదండ్రులకు పరిస్థితిని వివరించాడు. తనను కారులోకి ఎక్కించి ‘ఇంజక్షన్‌లు ఇస్తా కిడ్నీ అమ్మేస్తా’ అని బెదిరించినట్టుగా చిన్నారి వాంగ్మూలంలో వెల్లడించాడు. ఈ విషయమై కంగారు పడిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి అపరిచితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.


