అనాథ వృద్ధులకు బాలవికాస అండ
50 మంది వృద్ధులకు నిత్యవసరాలు, బట్టలు
అనాథ వృద్ధుల ఆదరణ దినోత్సవంలో సరుకుల పంపిణీ
కాకతీయ, తొర్రూరు : అనాథ వృద్ధుల ఆదరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తొర్రూరులోని లయన్స్ క్లబ్ భవనంలో బాలవికాస ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనాధ వృద్ధులకు నిత్యవసర సరుకులు, బట్టలు, బెడ్షీట్లు పంపిణీ చేశారు. కెనడా దేశానికి చెందిన బేతిన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలవికాస ఆధ్వర్యంలో 50 మంది అనాధ వృద్ధులకు బియ్యం, నిత్యవసర సరుకులు, బట్టలు, బెడ్షీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాట్లాడిన బాలవికాస ప్రోగ్రాం డైరెక్టర్ లతా… కొడుకులు, బిడ్డలు లేక నిరుపేద స్థితిలో ఉన్న వృద్ధులను గుర్తించి, ధర్మదాతల సహకారంతో ఈ సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. బాలవికాస పనిచేస్తున్న 28 గ్రామాల పరిధిలోని అనాధ వృద్ధులకు ఈ సాయం అందించామని పేర్కొన్నారు.
దాతల సహకారంతో రూ.1.75 లక్షల విలువైన సాయం
ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి మొత్తం రూ.1 లక్ష 75 వేల విలువైన సహాయాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. రియాల్టర్ బొమ్మనబోయిన రాజేందర్ యాదవ్ అనాధ వృద్ధులకు భోజన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా దాతలందరికీ బాలవికాస ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రామ్ నర్సయ్య, సెక్రటరీ రవీందర్ రెడ్డి, ఓంకార్ జ్యువెలర్స్ రాధాకృష్ణ, గుర్తూరు సర్పంచ్ విస్సంపల్లి కవిత–బాలకృష్ణ, ఎన్నమనేని శ్రీనివాసరావు, శ్రీమాతా ఆయిల్ నిర్వాహకులు రేవూరి శ్రీధర్, ఆస్మా రావుల అనిల్, పెద్దగాని వెంకన్న, సెంటర్ మేనేజర్ వై.రమ, మెయిన్ కో–ఆర్డినేటర్ ఎం.రమ, జె.శైలజ, శోభారాణి, ఎం.సరిత, బాలవికాస మహిళలు తదితరులు పాల్గొన్నారు. సేవాభావంతో నిర్వహించిన ఈ కార్యక్రమం వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు నింపింది.


