కాకతీయ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లారు. కేరళలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. “కేసీ వేణుగోపాల్ గారు ఎల్లప్పుడూ పేదల పక్షాన, అణగారిన వర్గాల కోసం పోరాడుతూ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలు, పిల్లల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. 2006లో ఆయన ప్రారంభించిన పొంథువల్ మెరిట్ అవార్డులు విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని నింపాయి. ఈ ఏడాది 150 పాఠశాలల్లో 3,500 మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ అవార్డులు అందుకుంటున్నారు. విద్య అనేది ఒక శక్తివంతమైన ఆయుధం అని, దాన్ని అందరికీ అందించడం మన బాధ్యత అని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. కేరళ రాష్ట్రం వంద శాతం అక్షరాస్యత సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచింది.
తెలంగాణలో కూడా విద్యాభివృద్ధి కోసం మేము పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాం. కేవలం 55 రోజుల్లో 11,055 ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేశాం. వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌ను నిర్మిస్తున్నాం. ఒక్కో స్కూల్‌ను రూ.200 కోట్లు ఖర్చుతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నాం. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నాణ్యమైన విద్య అందించాలన్నదే మా సంకల్పం. యువత నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఐటీఐలను అప్‌గ్రేడ్ చేసాం. యువతకు క్రీడల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం.
రాబోయే ఎన్నికలు కేవలం కేరళ అసెంబ్లీ ఎన్నికలు కాదు, దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలుగా భావించాలి. రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజల ఓటు హక్కు కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుంది. ఆర్థిక బలం లేకపోయినా, మీడియా మద్దతు లేకపోయినా, యువత శక్తినే నమ్ముకుని కాంగ్రెస్ పోరాటం సాగిస్తోంది. యువతే దేశ భవిష్యత్తు. 2029లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలన్నది మన అందరి కల. మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు, మీ భవిష్యత్తు కోసం, దేశం కోసం పోరాటం చేయాలని నేను కోరుతున్నా,” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.


