కరీంనగర్లో చికెన్ సెంటర్లు బంద్కు దూరం..
కాకతీయ, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాప్ యజమానుల సంఘం పిలుపునిచ్చిన బంద్కు వ్యతిరేకంగా కరీంనగర్ నగరంలో పలు చికెన్ సెంటర్లు బుధవారం సాధారణంగా తెరుచుకుని వ్యాపారం కొనసాగించాయి. మార్జిన్ పెంపు, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు తదితర సమస్యలపై రాష్ట్ర చికెన్ షాప్ యజమానుల సంఘం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చినా, కరీంనగర్లో కొందరు వ్యాపారులు దీనికి దూరంగా ఉంటూ తమ షాపులు తెరిచి విక్రయాలు సాగించడం గమనార్హం.
ప్రస్తుతం తీవ్రమైన వేసవి ఎండల వల్ల కోళ్లలో మరణాలు పెరగడం, ఫీడ్ ధరలు పెరగడం, ఇతర నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడంతో తాము తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని ఒక వర్గం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్జిన్ రేటు తగ్గడం వల్ల వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. అయితే, మరొక వర్గం వ్యాపారులు మాత్రం సమ్మెకు మద్దతు ఇవ్వకుండా సాధారణ వినియోగదారుల కోసం షాపులు తెరిచి విక్రయాలు కొనసాగిస్తున్నారు.
నగరంలోని ముఖ్యమైన మార్కెట్లు, రెసిడెన్షియల్ కాలనీల్లో ఉన్న కొన్ని చికెన్ సెంటర్ల వద్ద ఉదయం నుంచి కస్టమర్లు సాధారణంగా వస్తున్నట్లు, విక్రయాలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ పరిస్థితి వ్యాపారుల మధ్య భిన్నాభిప్రాయాలు స్పష్టంగా బయటపడుతున్నట్లు చెప్పవచ్చు.ఇది ఒకవైపు రాష్ట్రవ్యాప్త సమ్మె ప్రభావం తగ్గినట్లు కనిపించినా, మరోవైపు వినియోగదారులు మాత్రం సాధారణంగా చికెన్ లభ్యతపై ఊరట పొందుతున్నారు. అయితే, రాష్ట్రవ్యాప్త బంద్ ప్రభావం ఇతర జిల్లాల్లో ఎలా ఉంటుందనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.


