గర్మిళ్లపల్లిలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
కాకతీయ, ఐనవోలు : హనుమకొండ జిల్లా, ఐనవోలు మండలంలోని గర్మిళ్లపల్లి గ్రామంలో గ్రామ చరిత్రలో తొలిసారిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామంలో దేశభక్తి వాతావరణాన్ని నెలకొల్పింది.
ఈ సందర్భంగా బాలబోయిన ఆనంద్ ధర్మరాజ్ మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిరక్షకుడిగా శివాజీ మహారాజ్ ఎన్నో త్యాగాలు, కష్టాలు ఎదుర్కొని సనాతన ధర్మాన్ని స్థాపించి కాపాడిన మహానుభావుడని తెలిపారు. నేటి కాలంలో సనాతన ధర్మం పట్ల అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని, గ్రామ యువత అందరూ మేలుకుని శివాజీ మహారాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. శివాజీ స్థాపించిన ధర్మాన్ని పరిరక్షించటం తమ గ్రామ యువత లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సమీప గ్రామమైన వెంకటాపూర్ నుండి వచ్చిన మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గబ్బట రోజా అశోక్ పాల్గొని యువతను అభినందించారు. అలాగే బాలబోయిన రాజశేఖర్, గానబోయిన రాజు, చిరుత అశోక్, వాలికొండ అనిల్ తదితరులు హాజరయ్యారు.
గ్రామ యువత ఐక్యతతో నిర్వహించిన ఈ కార్యక్రమం గర్మిళ్లపల్లిలో కొత్త చైతన్యాన్ని నింపిందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.


