ఒక్క క్లిక్‌తో ఇందిరమ్మ ఇళ్ల స్టేటస్ చెక్
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
కాకతీయ, వరంగల్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులు తమ బిల్లుల స్టేటస్‌ను సులభంగా తెలుసుకోవడానికి ఒక కొత్త ఆన్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఇకపై లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే, తమ ఇంటి బిల్లు ఎక్కడి వరకు వచ్చింది, ఏ దశలో ఉంది, లేదా ఏ కారణంతో ఆగిపోయింది వంటి పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందవచ్చన్నారు. జిల్లా లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగం గా కొనసాగుతున్నాయని… ఈ స్కీమ్ కింద గుర్తించిన లబ్ధిదారులు… ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసే దిశగా ముందుకెళ్తున్నారన్నారు. పనులు ఆధారంగా ప్రభుత్వం కూడా నిధులను జమ చేస్తోందని… ప్రతి సోమవారం బిల్లుల చెల్లింపు కొనసాగుతోందన్నారు. అయితే చాలా మంది తమ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేదా అనేది తెలుసుకోవటానికి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని, బిల్లుల పేమెంట్ గురించి తెలుసుకునేందుకు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో…రాష్ట్ర గృహ నిర్మాణశాఖ కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతితో పాటు బిల్లుల పేమెంట్ వివరాలను సులభంగా తెలుసుకునేందుకు వీలుగా వెబ్ సైట్ లో ఆప్షన్లను తీసుకొచ్చిందని, లబ్ధిదారుల వివరాలు, ఇళ్ల పురోగతి, బిల్లుల చెల్లింపుల స్టేటస్ చెక్ చేసుకునేలా మాడిఫై చేసిందన్నారు. బిల్లుల పేమెంట్ తో పాటు ఇంటి పురోగతి స్టేటస్ తెలుసుకునేందుకు లబ్ధిదారులు ముందుగా http://indirammaindlu.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్ళి…. హోం పేజీలో స్టేటస్ పైకి వెళ్లాలని..ఇక్కడ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ లేదా పుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే మీ ఇంటి నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు డిస్ ప్లే అవుతాయన్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఆప్షన్స్ తో లబ్ధిదారులు తరచూ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా http://indirammaindlu.telangana.gov.in వెబ్‌సైట్‌లోనే సంబంధిత సేవలను చాలా సులభంగా పొందొచ్చన్నారు.


