మడికొండలో రోడ్డు ఆక్రమణకు చెక్
మూడు రోజుల్లో ఆక్రమణలు తొలగించాలి
జీడబ్ల్యూఎంసీ అధికారుల హెచ్చరిక
కాకతీయ, హనుమకొండ : మడికొండ ఎస్సీ కాలనీలో రోడ్డు స్థలాన్ని ఆక్రమించిన వారిపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు ప్రారంభించారు. కాజీపేట మండలం 46వ డివిజన్ పరిధిలోని మహిళా కమ్యూనిటీ హాల్ సమీపంలో ఉన్న రోడ్డు భాగాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించడంతో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై జాంబవ సంఘం అధ్యక్షులు వస్కుల ఆనందం, కాలనీ వాసులు చేసిన ఫిర్యాదు మేరకు మంగళవారం జీడబ్ల్యూఎంసీ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ నస్రీన్ బాను, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సిహెచ్ వెంకటరమణ సంఘటన స్థలాన్ని సందర్శించారు. పరిశీలన అనంతరం ఆక్రమణదారులకు అధికారులు స్పష్టమైన నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో రోడ్డు ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించాలని, లేనిపక్షంలో చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలనీవాసులు ఎవరూ ఆందోళన చెందవద్దని, సమస్యను త్వరగా పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. సమస్యపై వెంటనే స్పందించిన కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, సంబంధిత అధికారులకు జాంబవ సంఘం అధ్యక్షులు వస్కుల ఆనందం కృతజ్ఞతలు తెలిపారు.


