ఖమ్మంలో మారుతున్న సమీకరణాలు
కాంగ్రెస్‌లోకి కొనసాగుతున్న వలసలు
మంత్రి తుమ్మల సమక్షంలో కాంగ్రెస్‌లో భారీ చేరికలు
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి 60 కుటుంబాలు
33వ డివిజన్‌లో పై చేయి సాధించే దిశగా తుమ్మల వ్యూహం
కార్పొరేషన్ గెలుపే లక్ష్యంగా మంత్రి పావులు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరంలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా మరింత బలం చేకూరింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పాలనకు, ఖమ్మం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌కు చెందిన పలు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్ కార్పొరేటర్ తోట వీరభద్రం ఆధ్వర్యంలో మొత్తం 60 కుటుంబాలు మంత్రి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అభివృద్ధే కాంగ్రెస్ గుర్తింపు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే పార్టీకి ప్రధాన బలం అని అన్నారు. ఖమ్మం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే కేంద్రంగా రాజకీయాలు సాగాలని, అభివృద్ధి, సంక్షేమమే ప్రాతిపదికగా ముందుకు వెళ్లాలని అన్నారు. కాంగ్రెస్‌లో చేరిన కుటుంబాలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, ఖమ్మం మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ లతీఫ్, దొంగరి చంద్రమౌళి, దాస్ మౌళి, పులిపాటి సంపత్‌కుమార్, నల్లబెల్లి గౌతం, అల్లం శ్రీను, శెట్టి రమేష్, వడ్డబోయిన కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


