మార్చి 16న చలో కలెక్టరేట్
లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ముట్టడి
కార్మికుల హక్కుల కోసం పోరాటం అవసరం
ఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడు గౌని నాగేశ్వరావు పిలుపు
కాకతీయ, కొత్తగూడెం :కార్మికులకు ఉరితాళ్లుగా మారే నాలుగు లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తూ మార్చి 16న నిర్వహించే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐఎఫ్టియు నాయకులు పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా కొత్తగూడెంలో విస్తృత ప్రచారం చేపట్టారు. సింగరేణి కొత్తగూడెం ప్రధాన కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తూ ఈ నెల 16న జరిగే ధర్నాకు పెద్దఎత్తున కార్మికులు హాజరుకావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన ఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడు గౌని నాగేశ్వరావు, కొత్తగూడెం ఏరియా కార్యదర్శి ఎన్ సంజీవ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్‌లు కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తాయని అన్నారు. ఎన్నో త్యాగాలతో సాధించిన కార్మిక హక్కులను తొలగించే ప్రయత్నమే ఈ కోడ్‌ల వెనుక ఉందని విమర్శించారు. కార్మికులను కట్టుబానిసలుగా మార్చే విధంగా ఈ కోడ్‌లు ఉన్నాయని వారు పేర్కొన్నారు. పని గంటలను పెంచడం, కనీస వేతనాలు తక్కువగా నిర్ణయించడం వంటి చర్యలు కార్మికులకు అన్యాయం చేస్తాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ఈ కోడ్‌లను అమలు చేయాలనే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు నరసింహ, రామకృష్ణ, పాషా, కరుణ, సంధ్య, హుస్సేన్, బి లక్ష్మి, ప్రభాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


