ట్రిపుల్ తలాఖ్‌పై సవాల్
ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చింది బీజేపీనే
ఓవైసీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు స్పష్టత ఇవ్వాలి
ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్
కాంగ్రెస్ గెలిస్తే పన్నుల భారం అంటూ హెచ్చరిక
కాకతీయ కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాఖ్ రద్దుతో ముస్లిం మహిళలకు మేలు జరిగిందా? లేదా? అనే అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టంగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ట్రిపుల్ తలాఖ్ రద్దుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అనుకూలమా? వ్యతిరేకమా? ప్రజలకు తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లిం మహిళల సమస్యలపై ఒవైసీ ఎన్నడైనా మాట్లాడారా? అంటూ ప్రశ్నించారు. కరీంనగర్‌లోని బుట్టి రాజారాం కాలనీలో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో బండి సంజయ్ మాట్లాడుతూ ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేసి ముస్లిం మహిళలకు భరోసా కల్పించిన ఏకైక పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. ఈ రద్దును వ్యతిరేకిస్తున్న పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ముస్లిం మహిళలకు పిలుపునిచ్చారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే పన్నుల భారంతో ప్రజల నడ్డి విరుస్తారని హెచ్చరించారు.
స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి
స్మార్ట్ సిటీ నిధులతో ఆదర్శ్‌నగర్ నుంచి కోర్టు చౌరస్తా వరకు ప్రధాన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు అంతర్గత రోడ్లను అభివృద్ధి చేశామని బండి సంజయ్ అన్నారు. సుభాష్‌నగర్ ప్రభుత్వ పాఠశాలను కోటి రూపాయల వ్యయంతో మోడల్ స్కూల్‌గా మార్చి డిజిటల్ విద్యను అందిస్తున్నామని, 25వ డివిజన్‌లో అభివృద్ధి ఆశించిన స్థాయిలో కనిపించకపోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్‌లే బాధ్యత వహించాలని ఆరోపించారు. బీజేపీ మేయర్ గెలిస్తే నెల రోజుల్లోనే 25, 26, 27 డివిజన్లలో ఉన్న సమస్యల పరిష్కారానికి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తమ అభ్యర్థులు గుణవంతులని, ప్రత్యర్థులు ధనవంతులని విమర్శించారు. బీజేపీని గెలిపించి మేయర్ పీఠాన్ని అప్పగిస్తే డివిజన్ల రూపురేఖలు పూర్తిగా మార్చేస్తామని ప్రకటిస్తూ ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు.


