రాష్ట్ర సైన్స్ ఫెయిర్‌లో చక్రధర్ చక్రం!
33 జిల్లాల పోటీలో ప్రభుత్వ పాఠశాల సత్తా
బ్రాహ్మణ కొత్తపల్లి విద్యార్థికి ప్రథమ బహుమతి
కాకతీయ, నెల్లికుదురు : రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో మహబూబాబాద్ జిల్లా విద్యార్థి ప్రతిభ మరోసారి రాష్ట్రాన్ని ఆకట్టుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న పెరుమాండ్ల చక్రధర్ ప్రథమ బహుమతి సాధించాడు. 33 జిల్లాల నుంచి వచ్చిన ప్రతిభావంతుల మధ్య గట్టి పోటీని తట్టుకుని ఈ ఘనత సాధించడం విశేషంగా నిలిచింది. గత నవంబర్‌లో మహబూబాబాద్ జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన చక్రధర్, ఆ విజయంతో రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత పొందాడు. అక్కడ తన వినూత్న సైన్స్ ప్రాజెక్ట్‌తో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుని అగ్రస్థానంలో నిలిచాడు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభలో ఏమాత్రం తీసిపోరని చక్రధర్ మరోసారి నిరూపించాడని ఉపాధ్యాయులు కొనియాడారు.
ఉపాధ్యాయుల మార్గనిర్దేశమే బలం
ఈ విజయంలో గైడ్ టీచర్, ప్రధానోపాధ్యాయులు ఎం. వెంకటేష్ కీలక పాత్ర పోషించారని విద్యాశాఖ అధికారులు ప్రశంసించారు. ప్రాజెక్ట్ రూపకల్పన నుంచి ప్రదర్శన వరకు అందించిన సమగ్ర మార్గనిర్దేశమే విజయానికి కారణమని తెలిపారు. చక్రధర్‌కు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, స్థానిక ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ విజయం పాఠశాలకే కాదు, గ్రామానికే గర్వకారణమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.


