- ఆదానికి తప్ప దేశానికి చాలా ప్రమాదకరం
- బీజేపీ ఎక్కువ కాలం అధికారంలో ఉంటే రాజ్యాంగానికి, దేశానికి తీవ్ర నష్టం
- బీహార్‌లో ఎంఐఎం కక్షసాధింపుతో పోటీ చేయొద్దు
- సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు
- జుబ్లిహిల్స్‌లో బీజేపీని ఓడించండి : జాన్‌వెస్లీ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : దేశంలో విద్యుత్‌రంగాన్ని ప్రయివేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని సీపీఐ(ఎ) పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. దీనివల్ల అదానీకి లాభం కలుగుతుందని.. ప్రజలు, రైతులు, వినియోగదారులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యుత్ సబ్సిడీలు రద్దయ్యే అవకాశముందని చెప్పారు. విద్యుత్ ప్రయివేటీకరణ దేశానికే ప్రమాదకరమని అన్నారు. విద్యుత్ సవరణలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. భారత్‌పై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లతో తీవ్ర నష్టం కలుగుతుందని రాఘవులు చెప్పారు. భారత్‌పై ట్రంప్ కక్ష పెంచుకున్నారని, హెచ్‌ా1బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచారని విమర్శించారు.
బీజేపీకి లాభం చేసినట్లే..
బీహార్‌లో మహాకూటమిలో చేరేందుకు నిరాకరిస్తున్నందుకే వంద సీట్లలో పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయం తీసుకున్నట్టు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారని రాఘవులు చెప్పారు. రాజకీయ బలం ఉంటే పోటీ చేయొచ్చని అన్నారు. చెప్పినట్టు వినలేదు కాబట్టి నచ్చినట్టు పోటీ చేస్తామంటే సరైంది కాదని వివరించారు. అలా అయితే బీహార్ తూర్పు ప్రాంతంలో వామపక్షాలు బలమైన శక్తిగా ఉన్నాయనీ, ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశముందని చెప్పారు. కానీ బీజేపీని ఓడిరచడం కోసం తాము అవసరం మేరకే పోటీ చేస్తున్నామని వివరించారు. ఫాసిస్టు ధోరణితో ఉన్న బీజేపీ ఎక్కువ కాలం అధికారంలో ఉంటే రాజ్యాంగానికి, దేశానికి తీవ్ర నష్టమని అన్నారు. ఒవైసీ కూడా అలాంటి పద్ధతి అనుసరిస్తే బీజేపీని ఓడిరచడం సులభమవుతుందన్నారు. లేదంటే పరోక్షంగా బీజేపీ గెలుపునకు సహకరించిందన్న అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుందని చెప్పారు. లద్దాఖ్‌లో వాంగ్‌చుక్ అరెస్టు అప్రస్వామికమని విమర్శించారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ, రాష్ట్ర ప్రతిపత్తి హామీని నెరవేర్చాలని కోరారు.
న్యాయపోరాటంతోపాటు కేంద్రంతో పోరాడాలి : జాన్‌వెస్లీ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపించిందని గుర్తు చేశారు. కేంద్రం ఆమోదించకుంటే ఆర్డినెన్స్‌ను తెచ్చి గవర్నర్‌కు పంపిస్తే దాన్ని కూడా కేంద్రానికి పంపించారని అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం న్యాయపోరాటంతోపాటు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేయాలని కోరారు. తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చేలా చూడాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడిరచాలని ఆయన పిలుపునిచ్చారు.


