ఘనంగా సెంటినరి హెర్మోన్ బాప్టిస్ట్ చర్చి శతాబ్ది ఉత్సవాలు…
కాకతీయ, హనుమకొండ : 1925లో స్థాపితమై 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శాయంపేట హంటర్ రోడ్‌లోని సెంటినరి హెర్మోన్ బాప్టిస్ట్ చర్చి శతాబ్ది ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి చరిత్రను గుర్తు చేసుకుంటూ పాస్టర్ వాడ్నల రాము మాట్లాడుతూ.. 1925లో హనుమకొండ సెంటినరి బాప్టిస్ట్ సంఘం ఆధ్వర్యంలో మిషనరీలు రొకళ్ళ శాయంపేట (జాగీర్) గ్రామాన్ని సందర్శించి, అక్కడి ప్రజల పరిస్థితులను తెలుసుకొని నిత్యావసర సరుకులు అందించడంతో పాటు యేసుక్రీస్తు సువార్తను ప్రచారం చేశారని తెలిపారు. ఆ కాలంలో స్థానిక పెద్దలు అందించిన సహకారం వల్లే సంఘం బలపడిందని పేర్కొన్నారు. ప్రారంభంలో తెలుగు బాప్టిస్ట్ చర్చిగా, అనంతరం హెర్మోన్ బాప్టిస్ట్ చర్చిగా పేరు పొందిన ఈ ప్రార్థనా మందిరం, నేడు సెంటినరి హెర్మోన్ బాప్టిస్ట్ చర్చిగా 100 సంవత్సరాల ఘన చరిత్రను సంతరించుకుంది. శతాబ్ది ఉత్సవాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ పాస్టర్లు ప్రత్యేక అతిథులుగా పాల్గొని ప్రార్థనలు, సందేశాలతో కార్యక్రమాలను మరింత ఆధ్యాత్మికంగా నిర్వహించారు. సంఘ పెద్దలు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు. సెంటినరి ఉత్సవాల కమిటీ సభ్యులు, సెంటినరి కన్వీనర్ సుమంద ప్రసాద్, గాస్పెల్ కన్వీనర్ విశ్రాం విక్టర్, కన్‌స్ట్రక్షన్ చైర్మన్ వస్కుల భాస్కర్, ఈసీ సభ్యులు వస్కుల ప్రభాకర్, మత్తయి, మంద సాల్మన్, కొట్టే ప్రవీణ్, ఉమెన్స్ కమిటీ అధ్యక్షురాలు విశ్రాం సరోజ, యూత్ ప్రెసిడెంట్ మంద పవన్ కుమార్, సండే స్కూల్ సూపరింటెండెంట్ విశ్రాం పాల్సన్ పాల్గొన్నారు. ఈ శతాబ్ది ఉత్సవాలు సంఘ చరిత్రలో మరపురాని ఘట్టంగా నిలిచాయని విశ్వాసులు తెలిపారు.


