త్రినేత్రంగా సీసీ కెమెరాలు
సమాజ భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర
నేరాల కట్టడిలో.. చేధనలో ఎంతో ఉపయుక్తం
కెమెరాల ఏర్పాటు పెరిగితే పోలీసింగ్ మరింత సమర్థవంతం
సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్
కాకతీయ, చేర్యాల : సమాజ భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్ తెలిపారు. నేరాల నివారణ, కేసుల ఛేదనలో ఇవి పోలీసులకు మూడో కంటిగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. గురువారం చేర్యాల పట్టణ పరిధిలోని జాతీయ రహదారి, కాలనీలు, దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన 26 సీసీ కెమెరాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీపీ ఆధునిక కాలంలో నేరాలను అరికట్టడానికి సాంకేతిక పరిజ్ఞానం అవసరమని అన్నారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాల ఏర్పాటు పెరిగితే పోలీసింగ్ మరింత సమర్థవంతంగా మారుతుందని చెప్పారు. కెమెరాల ద్వారా నేరం జరిగిన వెంటనే నిందితులను గుర్తించడం సులభమవుతుందని వివరించారు. ప్రతి వీధిలో కెమెరాలు ఏర్పాటు చేస్తే నేరస్తులు ముందుగానే వెనుకడుగు వేస్తారని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు కేవలం కేసుల పరిష్కారానికి మాత్రమే కాకుండా, నేరాలు జరగకుండా నిరోధించడంలో కూడా కీలకంగా పనిచేస్తాయని అన్నారు. ప్రజలు తమ ఇళ్లలో, వ్యాపార సంస్థల్లో, అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే వ్యక్తిగత భద్రతతో పాటు సమాజ భద్రత కూడా బలోపేతం అవుతుందని సూచించారు.
ప్రతి ప్రాంతంలో కెమెరాలు అవసరం
ప్రత్యేకంగా ప్రధాన రహదారులు, క్రాస్ రోడ్లు, మార్కెట్ ప్రాంతాలు, బిజీ సెంటర్లలో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అవసరమని సీపీ తెలిపారు. గ్రామాల్లో కూడా ఈ అవగాహన పెరగాలని, స్థానిక నాయకులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కెమెరాల ఏర్పాటులో సహకరించిన వ్యాపార సంఘాల నాయకులను సీపీ అభినందించారు. వారి సేవలను గుర్తించి సన్మానించారు. కార్యక్రమంలో సీఐ రమేష్ నాయక్, చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి, మద్దూర్ ఎస్సై ఆసిఫ్, కొమురవెల్లి ఎస్సై మహేష్ తదితరులు పాల్గొన్నారు. తరువాత చేర్యాల పరిధిలోని ఆకునూరు రహదారి పక్కన ఉన్న పోలీస్ క్వార్టర్స్ ఖాళీ స్థలాన్ని సీపీ పరిశీలించారు. రెండు ఎకరాల స్థలాన్ని పరిశీలించి, పిచ్చి మొక్కలను తొలగించి ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఆ స్థలాన్ని పోలీస్ గ్రౌండ్‌గా అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


