‘బూడిద టెండర్ల’పై సీబీఐ విచారణ జరపాలి
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్
కాకతీయ, పెద్దపల్లి : ఎన్‌టిపిసి బూడిద టెండర్లలో గత పది సంవత్సరాలుగా జరుగుతున్న భారీ అవినీతి, మాఫియా దందాపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.గత దశాబ్దంగా బూడిద టెండర్ల పేరుతో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినా, వాటిలో ఎవరెవరి చేతులు ఉన్నాయో, ఎవరు మాఫియాకు మద్దతు ఇస్తున్నారో తెలుసుకోవాలంటే సీబీఐ విచారణ తప్ప వేరే మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.ఎన్‌టిపిసి యాజమాన్యం బూడిద టెండర్ల లెక్కలు మాయ చేస్తూ, పక్క గ్రామాలు బూడిద కాలుష్యంతో విలవిలలాడుతున్నా, బాధ్యత వహించే వారు లేరని సునీల్ విమర్శించారు.రోజురోజుకూ బూడిద మాఫియా పెరుగుతుండటమే కాకుండా, లక్షల కోట్ల రూపాయల దందా నడుస్తోందని, దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.గత పది సంవత్సరాలుగా జరిగిన టెండర్ల వివరాలను వెలికితీస్తే కోట్ల రూపాయల అవకతవకలు బహిర్గతం అవుతాయని, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కడారి సునీల్ డిమాండ్ చేశారు.


