కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో సంచలనం రేపిన హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసులో క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించింది. 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచెర్ల సమీపంలో వామన్‌రావు, ఆయన భార్య నాగమణి దారుణ హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే.
మొదట ముగ్గురిపై మాత్రమే కేసు నమోదు చేసిన పోలీసులు, తర్వాత విచారణలో మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ విచారణపై అనుమానాలు వ్యక్తం చేసిన వామన్‌రావు తండ్రి కిషన్‌రావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, ఈ ఏడాది ఆగస్టు 12న అత్యున్నత న్యాయస్థానం కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.
తాజాగా సీబీఐ ఆగస్టు 25న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఇన్‌స్పెక్టర్ విపిన్ గహ్లోత్ బృందాన్ని విచారణ కోసం నియమించింది. ఈ బృందం పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో వామన్‌రావు కుటుంబ సభ్యులను ప్రశ్నించి, కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించింది. అనంతరం అధికారులు మంథని కోర్టు ప్రాంగణం, దంపతులు కారు పార్క్ చేసిన ప్రదేశం, అలాగే హత్య జరిగిన కల్వచెర్ల ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సమయంలో గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్‌తో పాటు స్థానిక అధికారులు కూడా ఉన్నారు.
ప్రస్తుతం సీబీఐ ఆధారాలు, సాక్ష్యాలు, స్థానికుల వాంగ్మూలాలు సేకరిస్తూ కేసు వెనుక ఉన్న కుట్ర, కారణాలను వెలికితీయడానికి దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసులో నిజాలు భయపడటంపై రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


