కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల విచారణను తెలంగాణ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శుక్రవారం హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ సీబీఐ ఆఫీసులో అధికారులతో సమావేశం అయ్యారు. వ్యక్తిగత పనుల మీద ప్రవీణ్ సూద్ హైదరాబాద్ కు వచ్చినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.
కానీ కాళేశ్వరం విచారణను తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన ఐదు రోజుల్లోనే సీబీఐ డైరెక్టర్ స్వయంగా హైదరాబాద్ రావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రవీణ్ సూద్ వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్ వచ్చినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నప్పటికీ కాళేశ్వరం కేసు గురించి చర్చించేందుకు ఆయన నేరుగా హైదరాబాద్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సీబీఐ డైరెక్టర్ హైదరాబాద్ టూర్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఏఎస్ పార్టీలో హాట్ టాపిగ్గా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరిన విషయం తెలిసిందే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు ఆధారంగా కేసు దర్యాప్తు చేయలని ప్రభుత్వం సీబీఐని కోరింది.
దీనిలో భాగంగానే ఇప్పటికే కాళేశ్వరానికి సంబంధించిన అన్ని నివేదికలను సీబీఐకి అప్పగించింది. ఈ కేసు విచారణ కోసం రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీకి ఉన్న నిషేధాన్ని కూడా సడలించింది. కాళేశ్వరం కేసు విచారణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరడంతో సీబీఐ రంగంలోకి దిగనుంది. ప్రభుత్వం సమర్పించిన నివేదికల ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించనుంది.


