శీతాకాలపు పొగమంచులో జాగ్రత్త తప్పనిసరి
సురక్షిత డ్రైవింగ్‌పై ప్రజలకు విజ్ఞప్తి
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
కాకతీయ, కరీంనగర్ : శీతాకాలం మొదలయ్యాక తెల్లవారుజామున, రాత్రి వేళల్లో కమ్ముకునే దట్టమైన పొగమంచు రోడ్లపై ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం హెచ్చరించారు.దృశ్యమానత తగ్గిపోవడం వల్ల డ్రైవర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పౌరుల భద్రతే ముఖ్యమని, నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు.
కమిషనర్ విడుదల చేసిన ప్రకటనలో ఈ సూచనలు చేశారు.పొగమంచు సమయంలో హైబీమ్ వాడకూడదని, అది ప్రతిబింబించి దృశ్యమానతను మరింతగా తగ్గిస్తుందని తెలిపారు. అందువల్ల ఎల్లప్పుడూ లో బీమ్‌పై డ్రైవ్ చేయాలని సూచించారు. ముందున్న వాహనంతో సాధారణంగా ఉంచే దూరానికి రెట్టింపు దూరం పాటించాలని, ఆకస్మిక బ్రేకింగ్ పరిస్థితులు తప్పవని చెప్పారు. వేగం తగ్గించడం అత్యంత కీలకమని, క్రమశిక్షణతో డ్రైవ్ చేయాలని హెచ్చరించారు.దృశ్యమానత పరిస్థితులపై ఆధారపడి మాత్రమే ఫాగ్ ల్యాంప్‌లు ఆన్ చేయాలని, వాహనం ఆపినప్పుడు మాత్రమే హజర్డ్ లైట్లు వాడాలని చెప్పారు. లేన్ మార్చకుండా, రోడ్డుపై ఉన్న సైన్లు, రిఫ్లెక్టర్లను ఆధారంగా తీసుకుని ప్రయాణించాలి. ట్రాఫిక్ శబ్దం వినేందుకు విండో కొద్దిగా తెరిచి ఉంచడం కూడా ఉపయోగకరమని సూచించారు.విండ్‌షీల్డ్ తేమను తొలగించేందుకు వైపర్లు, డీఫాగర్లు వరుసగా ఉపయోగించాల్సిందిగా సూచించారు. పొగమంచు ఉండే రోజుల్లో ప్రయాణాన్ని కొద్దిగా ముందుగానే ప్రారంభించడం మంచిదన్నారు. దృశ్యమానత పూర్తిగా తగ్గినప్పుడు రోడ్డు పక్కకు సురక్షితంగా ఆపి పార్కింగ్ లైట్లు వేసుకోవాలని సూచించారు. ప్రయాణీకులందరూ సీటు బెల్టులు తప్పనిసరిగా ధరించాలని చెప్పారు.పొగమంచులో ఓవర్‌టేక్ చేయకూడదని, బ్లైండ్ కర్వ్స్ వద్ద వాహనాన్ని ఆపకూడదని, అలసట ఉన్నప్పుడు వాహనం నడపకూడదని హెచ్చరించారు. నావిగేషన్ కోసం అయినా మొబైల్ ఫోన్ వాడటం ప్రమాదకరమని తెలిపారు.మీ కుటుంబం మీ కోసం ఎదురు చూస్తోంది నెమ్మదిగా డ్రైవ్ చేయండి, అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా చేరుకోండి అని కమిషనర్ గౌష్ ఆలం సూచించారు.


