పదో తరగతి టాపర్లకు నగదు ప్రోత్సాహకాలు
కాకతీయ, నల్లబెల్లి : ప్రభుత్వ విద్యను ప్రోత్సహించి గ్రామీణ ప్రాంత ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వరంగల్ డివిజన్ మేనేజర్ వరప్రసాద్ అన్నారు. బుధవారం నల్లబెల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన “చదువుకో తెలంగాణ” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అపార ప్రతిభ దాగి ఉందని, అలాంటి ప్రతిభను వెలికితీసేందుకు ప్రోత్సాహం ఎంతో అవసరమన్నారు. అందులో భాగంగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు రాష్ట్రం నుంచి మండల స్థాయి వరకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వెల్లడించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రోత్సాహక బహుమతులు అందించి వారిని మరింత ప్రేరేపిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల ఉత్తేజానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయురాలు అంబి వసంత, కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల ప్రత్యేక అధికారి ఎ.సునీత, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నర్సంపేట బ్రాంచ్ మేనేజర్ యాదండ్ల రాజు, నల్లబెల్లి డివో పి.శ్రీను, బీడీఈ చరణ్ రాజ్, విజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


