నిరసన తెలిపినందుకు ఏడుగురిపై కేసు
మడికొండ ఘటనలో కేసు విచారణ వాయిదా
కాకతీయ, హనుమకొండ : మడికొండ నుంచి ధర్మసాగర్ వైపు భారీ వాహనాల రాకపోకల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, భారీ వాహనాలను మడికొండలోకి అనుమతించవద్దంటూ అంబేద్కర్ విగ్రహం సమీపంలో నిరసన చేపట్టిన ఘటనకు సంబంధించిన కేసు విచారణ సోమవారం హనుమకొండ జిల్లా కోర్టులో జరిగింది. ఈ కేసు విచారణకు మడికొండ ప్రాంత ప్రజలు కోర్టుకు హాజరయ్యారు. కేసును పరిశీలించిన జిల్లా జడ్జి శ్రావణ స్వాతి తదుపరి విచారణను మే 27, 2026కు వాయిదా వేస్తూ, కేసులో హాజరైన ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పూచీగా రూ.10 వేల చొప్పున సమర్పించాలని ఆదేశించారు. ఈ నిరసన కార్యక్రమం మడికొండలో భారీ వాహనాల వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టాలనే ఉద్దేశంతో నిర్వహించామని అప్పట్లో స్థానికులు పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసమే ఈ ఆందోళన చేపట్టామని, ఎలాంటి చట్టవిరుద్ధ ఉద్దేశాలు లేవని వారు స్పష్టం చేశారు. కోర్టుకు హాజరైన వారిలో పోనగోటి వెంకట్ రావు, గడ్డం మహేందర్, దువ్వ నవీన్, బొల్లికొండ వినోద్ కుమార్, మాచర్ల రంజిత్, చట్ల అజయ్, దువ్వ కిషన్ ఉన్నారు. ఈ కేసుపై తదుపరి విచారణ వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని కోర్టు సూచించినట్లు సమాచారం.


