మల్యాల కాలువలో కారు ప్రమాదం
వ్యక్తి మృతి
కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో వరద కాలువలో కారు పడిపోవడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన తిర్మణి రమణారెడ్డి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సీఐ నీలం రవి తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 18న రమణారెడ్డి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పెగడపల్లి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. అనంతరం సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆయన వాహనం కనిపించకపోవడాన్ని గుర్తించారు. ఈ క్రమంలో మల్యాల వరద కాలువలో కారు తేలుతున్నట్లు స్థానికులు సమాచారమివ్వడంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పెగడపల్లి ఎస్సై కిరణ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టి కారును బయటకు తీశారు. వాహనంలో లభ్యమైన మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. రమణారెడ్డి మృతితో ఆయన స్వగ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.


