భారత్‌కు రాలేం!
టీ20 వరల్డ్‌కప్‌పై బంగ్లా బోర్డు కఠిన వైఖరి
శ్రీలంకకు మ్యాచ్‌లు తరలించాలని బీసీబీ డిమాండ్
ఐసీసీతో సమావేశంలోనూ వెనక్కి తగ్గని బీసీబీ
ఐర్లాండ్‌తో గ్రూప్ మార్పిడి ప్రతిపాదన
వచ్చే వారం తుది నిర్ణయం తీసుకోనున్న ఐసీసీ
కాకతీయ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్‌కప్–2026కు సంబంధించి భారత్‌కు రావడాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తిరస్కరించింది. భద్రతా కారణాలను చూపుతూ తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని ఐసీసీని అధికారికంగా కోరింది. ఈ అంశంపై శనివారం జరిగిన సమావేశంలోనూ బీసీబీ తన వైఖరిని మార్చుకోబోమని స్పష్టం చేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 వరల్డ్‌కప్‌పై ఈ పరిణామం కొత్త వివాదానికి దారి తీసింది. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ, బీసీబీ వెనక్కి తగ్గకపోవడంతో ఐసీసీ తుది నిర్ణయం కీలకంగా మారింది. భారత్‌లో బంగ్లాదేశ్ జట్టు, అభిమానులు, మీడియా ప్రతినిధులు, ఇతర స్టేక్‌హోల్డర్ల భద్రతపై తమ ప్రభుత్వానికి తీవ్ర ఆందోళన ఉందని బీసీబీ ఐసీసీకి తెలిపింది. ఈ కారణంగానే తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని అధికారికంగా అభ్యర్థించినట్లు వెల్లడించింది. ఈ అంశాన్ని బీసీబీ ఇప్పటికే పలుమార్లు ఐసీసీ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తాజాగా జరిగిన సమావేశంలో మరోసారి స్పష్టం చేసింది.

గ్రూప్ మార్పిడితో సమస్యకు పరిష్కారం?
వివాదానికి తక్కువ లాజిస్టికల్ ఇబ్బందులతో పరిష్కారం చూపేందుకు బీసీబీ ఓ ప్రత్యామ్నాయ ప్రతిపాదనను ముందుంచింది. ప్రస్తుతం ఉన్న గ్రూప్ వ్యవస్థలో మార్పులు చేసి, బంగ్లాదేశ్‌ను ఐర్లాండ్‌తో గ్రూప్ మార్పిడి చేయాలని సూచించింది. ఈ ప్రతిపాదన ప్రకారం బంగ్లాదేశ్ గ్రూప్–సీకి మారి, తమ అన్ని లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడుతుంది. ఐర్లాండ్‌ను గ్రూప్–బీలోకి మార్చుతారు. ఐర్లాండ్ ఇప్పటికే కొలంబో, పల్లెకెలే వేదికలపై మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో, ఈ మార్పుతో పెద్దగా షెడ్యూల్ సమస్యలు ఉండవని బీసీబీ భావిస్తోంది. ఈ వివాదానికి నేపథ్యంగా ఇటీవల జరిగిన మరో పరిణామం కూడా చర్చకు వచ్చింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్, బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను జట్టు నుంచి విడుదల చేసింది. ఈ నిర్ణయం బీసీసీఐ ఆదేశాల మేరకే జరిగిందన్న కథనాలు రావడంతో, భారత్–బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగినట్లు భావిస్తున్నారు. శనివారం జరిగిన సమావేశంలో ఐసీసీ తరఫున ఈవెంట్స్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగం జీఎం గౌరవ్ సక్సేనా, ఇంటెగ్రిటీ యూనిట్ జీఎం ఆండ్రూ ఎఫ్గ్రేవ్ పాల్గొన్నారు. వీసా ఆలస్యంతో గౌరవ్ సక్సేనా ఆన్‌లైన్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. బీసీబీ తరఫున అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం, ఉపాధ్యక్షులు షకావత్ హొసేన్, ఫరూక్ అహ్మద్, క్రికెట్ ఆపరేషన్స్ కమిటీ ఛైర్మన్ నజ్ముల్ అబేదీన్, సీఈవో నిజాముద్దీన్ చౌదరి హాజరయ్యారు. సమావేశం నిర్మాణాత్మకంగా సాగిందని, సమస్య పరిష్కారానికి చర్చలు కొనసాగిస్తామని బీసీబీ వెల్లడించింది. మరోవైపు, అన్ని అంశాలపై అంతర్గతంగా సమీక్షించిన అనంతరం వచ్చే వారం తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు ఐసీసీ వర్గాలు సూచించాయి.


