కాకతీయ, ములుగు : ములుగు జిల్లా మంగపేట మండలం బ్రాహ్మణపల్లి చెక్‌పోస్ట్ వద్ద మంగపేట పోలీసులు గంజాయి రవాణాను అడ్డుకున్నారు. శుక్రవారం సాయంత్రం వాహనాల తనిఖీ జరుగుతుండగా, అనుమానాస్పదంగా వచ్చిన ఒక ఆటోను ఆపి పరిశీలించి 1.820 కిలోల గంజాయిను సీజ్ చేశారు. దీని మార్కెట్ విలువ సుమారు రూ.90వేలని పోలీసులు వెల్లడించారు.
ఏటునాగారం సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ గంజాయిని సీలేరు ప్రాంతం నుంచి తెచ్చి చుట్టుపక్కల ఎక్కువ ధరలకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్న సతీష్, సాగర్, ఖలీమ్, దుర్గాప్రసాద్, శ్రీనాథ్ ఒక టీమ్‌గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. రమణక్కపేటకు చెందిన శ్రీనుకు సరఫరా చేయడానికి వస్తున్న సమయంలో ఈ ఆటోను పట్టుకున్నట్టు తెలిపారు.
1.820 కిలోల గంజాయి, బజాజ్ ఆటో, ఒక మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగపేట ఎస్‌హెచ్‌ఓ టీవీఆర్ సూరి సిబ్బందితో కలిసి నిందితులను చాకచక్యంగా పట్టుకోవడంలో విజయం సాధించగా, ఏఎస్పీ, అధికారులు వారిని అభినందించారు.


