గంజాయి ముఠా గుట్టు రట్టు
బొమ్మకల్ బైపాస్‌లో ముగ్గురు అరెస్ట్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ రూరల్ పోలీసుల అప్రమత్తతతో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. బొమ్మకల్ బైపాస్‌లో నిర్వహించిన వాహన తనిఖీల్లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఎస్ఐ నరేష్ తన సిబ్బందితో కలిసి బొమ్మకల్ బైపాస్‌లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న రెండు బైకులను తనిఖీ చేయగా కొంత పరిమాణంలో గంజాయి లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. విచారణలో నిందితులు ఆ గంజాయిని ఆరుకులోని ఓ వ్యక్తి వద్ద కొనుగోలు చేసినట్లు వెల్లడించినట్లు సీఐ తెలిపారు. అరెస్టు అయిన వారిలో రామగుండానికి చెందిన సాయి వర్షిత్, కరీంనగర్ పట్టణానికి చెందిన సాయి కార్తీక్, సాయి తేజ ఉన్నారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు చెప్పారు. ఆపరేషన్ నిర్వహించిన ఎస్ఐ నరేష్‌ను, సిబ్బందిని సీఐ నిరంజన్ రెడ్డి అభినందించారు.


